వజ్రం లాంటి మనిషి విలువ ఇలా కట్టచ్చు

ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల ఓ వజ్రాన్ని తీసుకు వచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ కచ్చితంగా బేరీజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సభికులెవ్వరు ధైర్యం చేయకపోగా, నిపుణులంతా తలలు వేలాడేసుకున్నారు. అంతలోనే ప్రవేశించిన రామలింగడు రాజుగారి ప్రకటన విని “ఓస్‌ అదెంత పని” అనుకుంటు ముందుకు నడిచి, “రాజా! ఇది వెలకట్టలేని రాయి”, అని రాజుగారితో దాన్ని తీసుకుని తన ఛాతివద్ద పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఉంచాడు. “రామలింగా! ఏంచేస్తున్నావ్‌” సున్నితంగా మందలించాడు రాజు. “ప్రభూ! నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను” చెప్పాడు రామలింగడు. “రాజా! ఇది ఒక విలువలేని రాయి” తేల్చేశాడు రామలింగడు. “రామలింగా! ఇది విలువలేని రాయి అని నిరూపించు లేదా సభకు క్షమాపణలు చెప్పు” మరోసారి మందలించాడు రాజు. “సరే రాజా” అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి చీకటిగాచేసి ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు రామలింగడు. “రాజా! మీరు ఇందాకట్నుంచి చెబుతున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం” అన్నాడు రామలింగడు. రాజుతో సహా ఎవరూ ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా, రామలింగడు “అది మీ ముందున్న బల్లపైనే ఉంది. వజ్రమైతే చీకట్లోనూ మెరుస్తుంది కదా! నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కా లోపల పెట్టుకుని వెలుతురు కనబడుతుందేమోనని గమనించాను” అని అసలు విషయం చెప్పాడు రామలింగడు. ఆ రాయి వజ్రం కాదని నిరూపించి, పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలిరామలింగడు. మనిషి కూడా వజ్రం లాంటోడా లేక గాజు ముక్క లాంటోడా తెలియాలంటే… చీకటిలాంటి కష్ట సమయంలోనే అతని వెలుగు ఎంతవరకూ ప్రభావం ఉంటుంది..మెరుస్తాడా లేదా అన్న విషయం తెలుస్తుంది…