ఈ దేశభక్తుడుకి సెల్యూట్ కొడదాం

మన చిన్నప్పుడు స్కూళ్లల్లో దేశభక్తి గీతాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఆగస్ట్ 15 వస్తోందంటే ..ఎక్కడ చూసినా జెండా రెపరెపలు, దేశభక్తి పాటలు వినిపించేవి. జెండా క్రింద గాంధీ,నెహ్రూ వంటి జాతీయనాయకుల ఫొటోల పెట్టి..అగరొత్తులు వెలిగించి, కొబ్బరి కాయలు కొట్టేవారు. దేశం..మనం పూజించే దేవుడుతో సమానంగా..ఇంకా చెప్పాలంటే కాస్తంత ఎక్కువే అన్న భావన కలిపించేవారు. పిల్లల చేత అంతకు ముందు నెల రోజులు పాటు ప్రాక్టీస్ చేయించిన ..గాంధీ తాత మన బాపూజి వంటి పాటలు పాడించేవారు. ఆ తర్వాత అందరికీ మిఠాయిలు పంచేవారు. అంటే చిన్నప్పటి నుంచి దేశభక్తిని అలా ప్రోదు చేసేసారు. రోజులు మారాయి.  ఫేస్ బుక్ , ట్విట్టర్, వాట్సప్ వంటి సోషల్ మీడియాల్లో దేశభక్తి ఇప్పుడు పొంగుతోంది. అందరూ ప్రొఫైల్ పిక్చర్స్ గా జాతీయ జెండాను పెట్టుకుంటున్నారు. అలాగే నేడు ఆ పాటలను మరచిపోయే పరిస్థితి వచ్చింది. జెండావందనం కూడా మొ క్కుబడి తంతులా ముగించేస్తున్నాం.  ఇప్పుడు అతి కొద్ది పాఠశాలల్లోనే దేశభక్తి గీతాలాపన జరుగుతోంది. కొన్ని ఆధునిక గేయాలను రికార్డుల్లో వినిపిస్తున్నారు. పాటల పోటీ అంటే ఇప్పుడు పిల్లల నోటి నుంచి వచ్చేవి సినిమా పాటలే. సాహిత్యంతో సంబంధం లేకుండా మాస్ పాటలే వినాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది.  దేశభక్తి అనేది నిరంతర ప్రక్రియ. జీవనది లాంటిది.  తను పుట్టిన నేలను, సంప్రదాయాలను, చారిత్రకతను అభిమానించడం. తన మతాన్ని అనుసరిస్తూనే దేశభక్తిని కలిగి వుండటమే జాతీయత లేదా దేశభక్తి.ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో లాంటిది చూసినప్పుడు మనకు అర్దమవుతుంది. అసలైన దేశభక్తులెవరో…ఈ దేశభక్తుడుకు మనం సెల్యూట్ కొట్టాల్సిన సమయం ఇది. 

‘‘లేదురా ఇటువంటి భూదేవి ఇంకెందులేరురా నీవంటి పౌరులింకెందుఅవమానమేలరా, అనుమానమేలరాభారతీయుడనంచు భక్తితో పలుక’’ అన్న రాయప్రోలు మాటల్ని స్మరిస్తే దేశభక్తి అవుతుంది. ఈ దేశంలో పుట్టడం ఒక యోగం. ఈ నేలపై నడవటం ఒక భాగ్యం! ఈ దేశంలో పుట్టాను కాబట్టే నాకింత గుర్తింపు, పేరువచ్చింది- అని మనమంతా అనుకున్న నాడు నిజమైన దేశభక్తులమవుతాం.జై హింద్.